అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్
పొదలకూరు, మేజర్ న్యూస్ : అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యే సోమిరెడ్డికి ప్రజలు గుర్తుకొస్తారంటూ విమర్శించారు. పొదలకూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన కాకాణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని చెబుతున్న సోమిరెడ్డి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, బెదిరింపులకు గురిచేసి, జైళ్లకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అభివృద్ధిపై నమ్మకం ఉంటే రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని నిలదీశారు.సోమిరెడ్డికి సూటిగా రెండు ప్రశ్నలు వేస్తున్నానని కాకాణి పేర్కొన్నారు. లేఅవుట్ల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేయలేదని దేవుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.చర్చకు తేదీ, సమయం, వేదిక నువ్వే నిర్ణయించు ఏ దేవాలయంలోనైనా ప్రమాణానికి సిద్ధమా అంటూ సోమిరెడ్డిని కాకాణి ప్రశ్నించారు. ప్రజల ముందు వాస్తవాలు తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..