రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావుతల్లి క్షేమమే.. బిడ్డ భవిష్యత్తుకు భరోసా
కలిదిండి /కైకలూరు, మేజర్ న్యూస్ , కలిదిండి మండలం, మట్టగుంట గ్రామం లో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా మట్టగుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీల కోసం సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు పాల్గొని గర్భిణీ స్త్రీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అండ్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాతృత్వం ప్రతి కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన సందర్భమని అన్నారు. గర్భిణీ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని, అందువల్ల గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రతి గర్భిణీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు, తల్లి–బిడ్డ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. గర్భిణీలకు కుటుంబ సభ్యులు ప్రేమ, ఆప్యాయతతో మానసికంగా, శారీరకంగా అండగా నిలవాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో పాటు సమాజం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి ఆరోగ్యం బిడ్డ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, గర్భిణీలు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గర్భిణీ స్త్రీలను ఒకచోట చేర్చి సామూహిక శ్రీమంతం నిర్వహించడం ద్వారా వారికి ఆత్మీయత, భరోసా కల్పించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ నాగిడి వీరబ్రహ్మం, పీఏసీఎస్ అధ్యక్షులు బళ్లా రాజు, కోకా శ్రీనివాసరావు, తిరుమల శెట్టి ఈశ్వర పరశురాముడు, కోకా తాతయ్య, మోకా ఆదినారాయణ, వాతాడి రాంబాబు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బి.సుందరమ్మ, పంచాయతీ కార్యదర్శి గంగా శంకర్, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా