తాటిపూడి బాలికల గురుకుల కళాశాల సమస్యలను పరిష్కరించాలి
లక్క వరపు కోట, సూర్య: తాటిపూడి (ముషిడిపల్లి గ్రామం) లోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల (APRJC Girls) లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ సి. శారదా బాయి, అధ్యాపక బృందం ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాలలో ప్రస్తుతం 260 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తూ హాస్టల్‌లోనే నివాసముంటున్నారని తెలిపారు. గతంలో (2014 హుద్‌హుద్ తుఫాను సమయంలో) తూర్పు వైపు కూలిపోయిన సుమారు 140 మీటర్ల కాంపౌండ్ వాల్‌ను ఇప్పటివరకు పునర్నిర్మించకపోవడంతో విద్యార్థినుల భద్రతకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కళాశాల ప్రాంగణంలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో నిత్యావసర సరుకులు, బియ్యం, గ్యాస్, కూరగాయల వంటి రవాణా వాహనాలు లోపలికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణానికి, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేయాలని లేదా సంబంధిత అధికారులను ఆదేశించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లలిత కుమారి, నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుని బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.