పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా 'గణిత దీప్తి' పుస్తకాల పంపిణీ
నెల్లిమర్ల, సూర్య: జరజాపుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గణిత ఉపాధ్యాయుడు శివుకు బంగారయ్య మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. గురువారం స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా 'గణిత దీప్తి' పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో-1 యు.ఎస్.ఎన్. మూర్తి, ఎంఈవో-2 సిద్ధాంతం తినాధరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు గణిత సబ్జెక్ట్‌లో మంచి ప్రతిభ కనబరిచి, పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే సత్సంకల్పంతో బంగారయ్య ఈ పుస్తకాలను అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు విద్యాపరంగా నిరంతరం తోడ్పాటునందిస్తూ, వారి విజయానికి తన వంతు సహకారం అందిస్తున్న ఆయన సేవలు ఇతరులకు ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి ఏటా స్వచ్ఛందంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్న శివుకు బంగారయ్య సేవలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.