BREAKING
శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

రాజ్యాంగ బలోపేతంపై నిబద్ధత _ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Select Suryaa Now
రాజ్యాంగ బలోపేతంపై నిబద్ధత _ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో మనమిప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సహా రాజ్యాంగ పరిషత్తులోని ప్రతి సభ్యుడినీ స్మరించుకుంటున్నాం. ఒక ఆధునిక రాజ్యాంగ రచనలో సుసంపన్న భారతీయ సంప్రదాయాలు, నాగరిక విజ్ఞానం నుంచి విస్తృత స్ఫూర్తి పొందడంలోనే వారి గొప్పదనం స్పష్టమవుతుంది.
అనేక మతాలు, భాషలు, ఆచారాలు, ఆలోచన ధోరణులుగల భారత్‌ వంటి వైవిధ్యభరిత దేశం కోసం రూపొందిన రాజ్యాంగమంటే- పార్లమెంటు, న్యాయస్థానాల పరిధులకు మించి అది విస్తృత ప్రభావం చూపగలిగినదై ఉండటం చాలా ముఖ్యం. మన ప్రజల... ముఖ్యంగా మన యువతరంలోని సమష్టి చైతన్యంతో దాని అనుబంధం మరింత విస్తృతమయ్యేలా, దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడం కోసం మేం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. అందుకే, నవంబరు 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని మా ప్రభుత్వం దశాబ్ద కాలంకన్నా ముందే నిర్ణయించింది.
నాతో సహా కోట్లాది భారతీయులకు ఈ రాజ్యాంగం మనందరి జీవిత ప్రస్థానంలో అవిభాజ్య   భాగం. నా బాల్యాన్ని, నేను పెరిగిన నిరాడంబర పరిస్థితులను, దైనందిన జీవన పోరాటాన్ని ఓసారి వెనుదిరిగి చూసుకున్నపుడు- మన రాజ్యాంగంపై నాలో అపార కృతజ్ఞతా భావన పొంగిపొరలుతుంది. ఎలాంటి ప్రత్యేక హక్కులు లేదా పుట్టుకతో వచ్చే ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బిడ్డకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సేవ చేసే గురుతర బాధ్యత లభించడాన్ని బట్టి మన రాజ్యాంగం ఎంత అసాధారణమైనదో ప్రస్ఫుటమవుతుంది. ఒక వ్యక్తి పుట్టుక, పరిస్థితులు అతని భవిష్యత్తుకు హద్దులు గీయలేవనే వాస్తవం ఈ రాజ్యాంగం వల్లనే తేటతెల్లమవుతోంది.
ఈ నేపథ్యంలో మా వంతుగా మన రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ కృతజ్ఞతా పూర్వక రుణం తీర్చుకోవడానికి మేం ప్రయత్నించాం.
ప్రసిద్ధ రాజ్యాంగ వేత్త గ్రాన్‌విల్ ఆస్టిన్ మన రాజ్యాంగాన్ని “ఇది అన్నింటికన్నా ముందు  ఒక సామాజిక పత్రం” అని అభివర్ణించారు. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం అన్వేషణ మన రాజ్యాంగ మూలాల్లోనే నిక్షిప్తమైంది. కాబట్టి, మన రాజ్యాంగ రూపకర్తల ఆశయ సాకారానికి కృషి చేయడాన్ని మించి మనకు సంతృప్తినిచ్చేది ఇంకేముంటుంది?
భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. తరతరాలు కొనసాగిన లేమి నుంచి బయటపడిన   కోట్లాది తల్లిదండ్రులకు నేడు తమ బిడ్డల మెరుగైన భవిష్యత్తుపై కలలు కనే అవకాశం లభించింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక కుటుంబాన్ని పూరింటి నీడ నుంచి పక్కా ఇంటి భద్రత నిచ్చినపుడు పౌరుల ఆత్మగౌరవం అనే రాజ్యాంగ హామీ సార్థకమవుతుంది.
ఉజ్వల యోజన.. ఒక తల్లిని వంటింటి పొగ నుంచి విముక్తం చేసినపుడు సమానత్వం, సంక్షేమం అనే ఆదర్శాలను మనం నెరవేర్చినవాళ్లం కాగలం.
ఆయుష్మాన్ భారత్ పథకం ఒక పేద కుటుంబానికి అప్పుల భయం తీర్చేలా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం కల్పించినపుడు సామాజిక న్యాయం సాక్షాత్కరిస్తుంది.
ముద్రా, పీఎం స్వానిధి పథకాలు చిన్న పారిశ్రామికవేత్తలకు, వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలను సమకూర్చినపుడు ఆర్థిక న్యాయం రూపుదాలుస్తుంది.
డిజిటల్ సాంకేతికతలు, యూపీఐ వంటి వేదికలు అన్నిరకలా విభజన రేఖలను చెరిపి వేస్తున్నాయి. తద్వారా ఒకనాడు కొద్దిమంది ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైన అవకాశాలను ప్రతి పౌరుడికీ అందుబాటులోకి తెచ్చినప్పుడు, సార్వజనీనతపై రాజ్యాంగ ఆదర్శాన్ని మనం సాకారం చేస్తాం.
ఈ రాజ్యాంగ దృక్పథానికి ఇంకా అనేక రూపాలున్నాయి.
ఇందులో మేం తెచ్చిన సవరణల జాబితాను కూడా ఇదే కోణంలో చూడవచ్చు. ఈ మేరకు 101వ సవరణ- ఎంతో కాలం నుంచీ ఎదురుచూస్తున్న ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ)ని అమలులోకి తెచ్చింది. ఇక 102వ సవరణతో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించగా, సమాజంలోని అణగారిన వర్గాల చిరకాల స్వప్నం నెరవేరింది.
అలాగే, 103వ సవరణకు విస్తృత సామాజిక ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ద్వారా ఇది ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ పరిధిలో లేని వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల దీర్ఘకాలిక విస్మృత ఆకాంక్షలను నెరవేర్చింది.
1950 తర్వాత తొలిసారిగా, మన రాజ్యాంగం యొక్క నవీకరించబడిన ప్రతి... ఇప్పుడు ఎనిమిదవ షెడ్యూల్‌లోని 22 భాషలన్నింటిలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇది మన రాజ్యాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది.
రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చాక కూడా మనం 1860ల నాటి వలసవాద శిక్షాస్మృతి ప్రకారమే పరిపాలన కొనసాగించాం. భారతీయ న్యాయ సంహిత ద్వారా మన నేర న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక మార్పు తేవడానికి మేం ప్రయత్నించాం. వలస పాలన కాలపు శిక్షకు ప్రాధాన్యం నుంచి పౌర కేంద్రక న్యాయ ప్రదానం వైపు ఈ మార్పును తెచ్చాం.
గడచిన దశాబ్దం నుంచీ, మనం కర్తవ్యంపై- అంటే... పౌర విధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. మన నాగరికత సదా సమాజంలోని ప్రతి పాత్రకూ గల బాధ్యతలను ప్రస్ఫుటం చేస్తుంది. స్వచ్ఛ భారత్ నుంచి జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దాకా అనేక ప్రజా ఉద్యమాలలో ఈ కర్తవ్య స్ఫూర్తి ద్యోతకమైంది.
అయితే, ఈ సందర్భంగా నేను ప్రస్తావించక తప్పని వాస్తవం మరొకటుంది. మన చరిత్రలో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతగల వారే దాన్ని బలహీనపరిచిన సందర్భాలున్నాయి. ఇంకా చిత్రమేమిటంటే- దేశాన్ని ఐదు దశాబ్దాల పాటు పాలించిన వారు కూడా వీరే.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ఓ ప్రభుత్వం, తాత్కాలిక పార్లమెంటులో తన ఆధిక్యాన్ని అడ్డుపెట్టుకుని, పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు పరిమితులు విధించిన 1951 నాటి తొలి రాజ్యాంగ సవరణకు ఈ ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత తొలి సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు చేసిన ఈ పని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను అణచివేసేందుకు ఉద్దేశించినదని రుజువైంది. అత్యవసర పరిస్థితి ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు చేసిన 42వ రాజ్యాంగ సవరణకూ 50 ఏళ్లు పూర్తవుతాయి. ఇది న్యాయ సమీక్షను పరిమితం చేసి, సంస్థాగత అధికారాల సమతౌల్యాన్ని ప్రాథమికంగా మార్చివేసింది. అధికార దాహం, రాజ్యాంగ వ్యతిరేక నాయకత్వం ఎంతటి అకృత్యాలకు పాల్పడగలదో యువతరం తెలుసుకోవడం అవశ్యం. ఇందుకోసం 38, 39వ రాజ్యాంగ సవరణలను కూడా అధ్యయనం చేయాలని యువతీయువకులందర్నీ కోరుతున్నాను.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల రద్దుకు ఆర్టికల్ 356ను పదేపదే దుర్వినియోగం చేయడం కూడా మరో ఆందోళనకర అధ్యాయాన్ని వెలుగులోకి తెస్తుంది. ఒక పార్టీకి ఈ ఆర్టికల్‌ను దాదాపు వంద సార్లు దుర్వినియోగం చేసిన చరిత్ర ఉండగా, అందులో ఒక మాజీ ప్రధానమంత్రి వాటా 50 శాతం ఉండటం గమనార్హం.
రాజ్యాంగంలోని ప్రతి అక్షరం దేశమంతటా స్ఫూర్తిదాయకంగా అమలు కావాలన్నది మన రాజ్యాంగ రూపకర్తల ఆకాంక్ష. అయితే, 70 ఏళ్లకు పైగా కాలం 370, 35ఎ అధిఃకరణాల అమలు వల్ల జమ్మూకాశ్మీర్‌లో వారి ఆశయం నెరవేరలేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు సహా మహిళా హక్కులకు భంగం కలిగింది. చివరకు 2019లో ఈ చారిత్రక తప్పిదాన్ని మేం సరిదిద్దాం.
దేశంలో అనేక చోట్ల... ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నక్సలైట్లు తుపాకీలు ఎక్కుపెట్టి, నిరుపేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాచారు. అయితే, ఈ ఏడాదిలోనే నక్సలిజాన్ని రూపుమాపడం ఎంతో ఆనందించాల్సిన విషయం. తద్వారా నిరుపేదలు కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా రాజ్యాంగబద్ధ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోగల అవకాశం లభించింది. ప్రస్తుతం ఇక మిగిలింది ‘మేధావి నక్సలైట్లు’ (దిమాగీ నక్సల్స్‌) మాత్రమే. నేటి వాస్తవ పరిస్థితులతో తమకెలాంటి సంబంధం లేదని వీరు భావిస్తారు. అయినప్పటికీ, దేశ ప్రగతిని అడ్డుకోవడానికి వీరు సదా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి, ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించాలని భావించడం అత్యంత విచారకరం. మన రాజ్యాంగ రూపకర్తలు... ప్రత్యేకించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇలాంటి ప్రతిపాదనలను పూర్తిగా వ్యతిరేకించారు.
చివరగా, మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల విశేష కృషిని విస్మరించలేం. వారి ప్రమేయం లేనిదే రాజ్యాంగ ప్రస్థానం పరిపూర్ణం కాజాలదు. అయితే, ఈ ఏడాది మొదట్లో మనందరికీ సిగ్గుచేటుగా అనిపించే ఒక సంఘటన చోటుచేసుకుంది. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో తెచ్చిన చట్టాన్ని ఓ ప్రతిపక్షం అడ్డుకుంది. రాజ్యాంగ విలువలపై వారి నిర్లక్ష్యాన్నినికి ఇది మరో తార్కాణం. కానీ, వారికి న్యాయం లభించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు... దేశంలోని ‘నారీశక్తి’కి ఇదే నా హామీ.
మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్రకు విస్పష్ట నిర్వచనం ఉంది. కానీ, దురదృష్టవశాత్తూ ‘ప్రతిపక్షం’ కన్నా ‘అవరోధ’ పక్షం పాత్రకు ప్రధాన విపక్షం దిగజారినట్లు కనిపిస్తోంది. రాజ్యాంగ బాధ్యత నిర్వర్తించడమంటే ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఆటంకం కలిగించడం కాదనే వాస్తవాన్ని వారు గుర్తెరగాలి.
భారత్‌ ఇవాళ ఓ కీలక  మలుపులో ఉంది... దేశాన్ని 2047కల్లా ‘వికసిత భారత్‌’గా రూపొందించేందుకు మనం చేస్తున్న సమష్టి కృషికి రెండు సరళ, శక్తియుత సూత్రాలు మార్గనిర్దేశం చేయగలవు. అవేమిటంటే- ‘దేశమే ప్రధానం’ అన్నది మన తారకమంత్రంగా ఉండాలి. అలాగే, ‘కర్తవ్య నిర్వహణ’ మన కార్యాచరణ కావాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడే మన శక్తిసామర్థ్యాలకు రాజ్యాంగం దన్నుగా భావి తరాలకు ఉజ్వల భవిష్యత్తును వారసత్వంగా అందించగలం.