రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
*నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేయాలని సీఎం సూచన*
*కేంద్రంతో సమన్వయం చేసుకుని ఔటర్ రింగ్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి ఆదేశం
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
రాజధాని అమరావతిలో నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. పనుల పరోగతిని, ఆయా ప్రాజెక్టుల స్థితిగతులను అధికారులు వివరించారు. గడిచిన నెలలో రాజధానిలో రూ.1,345 కోట్ల విలువైన పనులు చేసినట్టు చెప్పారు. వీటిని రూ.2 వేల కోట్లకు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు... ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. దీని కోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజధాని పనుల్లో ఎక్కడా అశ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల విషయంలో ఎక్కడా పనులు ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్‌గా ఉండాలన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల హాజరయ్యారు.