పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు.
అనపర్తి మేజర్ న్యూస్. నియోజకవర్గంలో పేకాట, జూదాల నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శలు చేశారు. అనపర్తి నియోజకవర్గాన్ని జూదాలకు కేంద్రంగా మార్చవద్దని ఆయన కోరారు.రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో ఇటీవల పేకాట నిర్వహిస్తున్న ప్రాంతంపై ప్రత్యేక బలగాలు దాడి చేసి పలువురిని పట్టుకున్న ఘటనపై ఆయన స్పందించారు.
ఈ వ్యవహారంలో అసలు నిర్వాహకులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పట్టుబడిన ప్రాంతాన్ని వేరే ప్రదేశంగా చూపించేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో పేకాట, జూదాల నిర్వహణ వెనుక రోజువారీ ముడుపుల వ్యవహారం ఉందని సత్తి ఆరోపించారు. పెద్ద కేంద్రాల నుంచి భారీ మొత్తాలు, చిన్న గ్రామాల నుంచి కూడా ముడుపులు వసూలు చేస్తున్నారని అన్నారు.
గతంలో కూడా నియోజకవర్గంలో బెట్టింగ్, జూదాలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్థానిక పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే పేకాట, జూదాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.