పీఏసీఎస్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు
పార్వతీపురం, సూర్య : పీఏసీఎస్‌లను బలోపేతం చేయడంతో పాటు వాటి ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు.బుధవారం పార్వతీపురం డీసీసీబీ కార్యాలయంలో ఆయన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షులు, ప్రతినిధులు తమ సమస్యలను నాగార్జున దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు సమర్పించారు.పీఏసీఎస్‌లలో హోల్డ్‌లో ఉన్న ఫెర్టిలైజర్ లైసెన్సుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, కొత్తగా పెట్రోల్ బంక్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇప్పించాలని వారు కోరారు.మధ్యలో నిలిచిపోయిన ఎంఎఫ్‌పీసీ గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని, సొసైటీలకు నాన్-క్రెడిట్ వ్యాపారాలు నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా క్రాప్ లోన్ల పరిమితిని పెంచాలని, గతంలో మాదిరిగానే చిరు వ్యాపారులకు పెట్టీ ట్రేడర్ రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు.
1-బి ఫోటోలు అందుబాటులో లేకపోవడం వల్ల రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, సొసైటీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీఏసీఎస్ అధ్యక్షులు కోరారు. సంబర సొసైటీ ఫెర్టిలైజర్ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ పీఏసీఎస్‌లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంఎఫ్‌పీసీ గోడౌన్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్‌పీఏ, మొండి బకాయిలపై ఉక్కుపాదం ఎన్‌పీఏ విషయంలో ఏమాత్రం ఉపేక్ష ఉండదని, మొండి బకాయిల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా సహకార బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. విద్య, గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు 8.5 శాతం వడ్డీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆప్కోబ్ లో ప్రస్తావించామని తెలిపారు. దీంతో విద్యా రుణాలపై వడ్డీని 8 శాతానికి, గృహ రుణాలపై వడ్డీని 7.5 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు, వీటి కోసం ఆప్కోబ్ ద్వారా విజయనగరం డిసిసిబి కి రూ.100 కోట్ల నిధులు అందించినట్లు వెల్లడించారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని నాగార్జున స్పష్టం చేశారు. పీఏసీఎస్‌లు మరింత బలోపేతం కావడానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సి.హెచ్. ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు శంబాన రఘు,జి.సుదర్శన రావు, పొట్నూరు కుమారి, కోట గౌరి భారత్, పి.పూర్ణచంద్ర రావు, కునపురెడ్డి నారాయణ రావు, జి.చంద్ర మౌళి,పి. కిషోర్, కె.మని, డి.సోములు, ఆర్.బి. ఎస్.నాయుడు, శ్రీరామ్ మూర్తి, పొట్నూరు జగన్ మోహన్, విమల స్వామి నాయుడు,దాసరి రమణ, ముడైరెడ్డి మజ్జ రావు, కరణం రాము నాయుడు, గౌరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Reporter : SS Naidu, Parvathipuram Dist.