ప్రియురాలి గొంతు కోసి భవనంపై నుంచి దూకిన యువకుడు.. ప్రియుడు మృతి, యువతి పరిస్థితి విషమం
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారి ప్రియురాలిపై అత్యంత భయానకంగా దాడి చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న అనే యువకుడు తన ప్రియురాలితో గొడవపడి, తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి కిందపడిపోగా, ఆ నగరంలోనే తాను గడిపిన భవనం పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. తీవ్రగాయాలైన ప్రియుడు చిన్న ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
గమనించిన స్థానికులు వెంటనే రక్తపు మడుగులో ఉన్న యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దాడికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.