ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ
వాతావరణ మార్పులను తట్టుకునే సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి
2027 నాటికి RDS నమూనాల అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి
– RySS ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయ్ కుమార్
శ్రీకాకుళం, నవంబర్ 13 మేజర్ న్యూస్: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర రైతు సాధికార సంస్థ (RySS) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. విజయ్ కుమార్ సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ తో కలిసి ఎం ఎఫ్ ఏ లు, ఎఫ్.ఎం.పి.టి.లు, శాస్త్రవేత్తలు, మెంటార్లతో ప్రకృతి వ్యవసాయ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో వరి, జీడిపప్పు, కొబ్బరి, మొక్కజొన్న తదితర పంటల్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు, వినూత్న సాగు విధానాలు, రైతులు సాధిస్తున్న ఫలితాలను అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వివరించారు.
రైతుల అనుభవాలు.. వినూత్న సాగు నమూనాలపై చర్చ
వరి సాగులో జ్యోతమ్మ అనుసరిస్తున్న వర్షాధార RDS నమూనా, టి. శివానందం అమలు చేస్తున్న రైజ్డ్ బెడ్ ప్యాడీ (Raised Bed Paddy) విధానాలను సమీక్షించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో చిన్నమ్మడు సాధిస్తున్న అనుభవాలను తెలుసుకున్నారు. రైతులు సత్యనారాయణ, కృష్ణ లు కొబ్బరి తోటల్లో అంతర పంటలు సాగుకు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, కల్యాణి మొక్కజొన్న సాగులో చేపడుతున్న వినూత్న విధానాలను వివరించారు. జిల్లాలో జీడిపప్పు సాగుకు సంబంధించిన ప్రకృతి వ్యవసాయ నమూనాలపైనా చర్చించారు.
365 రోజులూ భూమిపై పంటల కవచం ఉండాలి
2027 సంవత్సరానికి సంబంధించిన RDS (రౌండ్ ది ఇయర్ సిస్టమ్) కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. భూమిని ఏడాది పొడవునా పంటలతో కప్పి ఉంచడం ద్వారా నేలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా చూడాలని, పంటల వైవిధ్యాన్ని పెంచాలని విజయ్ కుమార్ సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయ విధానాలకు RDS ఎంతో కీలకమని వివరించారు. జిల్లాలో ఎక్కువమంది వరి పంట సాగు చేస్తున్నందున, ఒక ఎకరా వరి సాగు ద్వారా కూడా లక్ష రూపాయలకు మించి ఆదాయం పొందేలా రైతులు వినూత్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను అనుసరించాలని సూచించారు. ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో APCNF నమూనాలను అభివృద్ధి చేసి, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ
జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అవసరమైన చర్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, విజయవంతమైన సాగు విధానాలను, ప్రకృతి వ్యవసాయం, రసాయనిక ఎరువులు వాడడం వ్యత్యాసం మరింత మంది రైతులకు చేరవేసే అంశాలపై విసృతంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్.టి.ఎల్ ప్రకాష్, డి .పి.ఎం. పూజారి సత్యనారాయణ, ఎం.ఎఫ్. ఎ లు, శాస్త్రవేత్తలు, మెంటార్ లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.