ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయాలి
అనంతపురం బ్యూరో
ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులు, న్యాయపరమైన రక్షణ ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా న్యాయవ్యవస్థ కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ లిసాగిల్ అన్నారు. ఆదివారం తాడిపత్రి, గుత్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు న్యాయస్థానాలను ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తాడిపత్రిలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ లిసాగిల్ మాట్లాడుతూ న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. అనంతపురం జిల్లాలో 17 నూతన అదనపు కోర్టులు మంజూరైనట్లు తెలిపారు.
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.ఎస్. భానుమతి మాట్లాడుతూ బార్, బెంచ్ మధ్య సమన్వయం కీలకమని, కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. నూతన జిల్లాలకు అనుగుణంగా కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, సాంకేతిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ చల్లా గుణరంజన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు, జిల్లా ఎస్పీ జగదీష్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.