ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు నిదర్శనం--ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ‘సేవా జ్యోతి యాత్ర’ను నిర్వహిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. బుధవారం కోవూరులో నిర్వహించిన సేవా జ్యోతి యాత్ర ర్యాలీలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవను స్మరించుకుంటూ, ఆయన సేవా ప్రస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాసేవలో ఎక్కువ కాలం ఉండటం వేరు.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం వేరు
దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన నాయకులు చాలా మంది ఉన్నారని, వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉండటం వేరని, ప్రజల జీవితాల్లో ఎక్కువ మార్పులు తీసుకురావడం వేరని అన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను అర్థం చేసుకోవాలంటే మోదీ గారి 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. వంటింట్లో మహిళల కష్టాల నుంచి దేశ సరిహద్దుల్లో శత్రువులపై క్షిపణులతో నిప్పులు కురిపించడం వరకు మోదీ గారి నాయకత్వంలో దేశం అనేక మార్పులను చూసిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. భారతదేశ మహిళల సింధూరాన్ని కాపాడటం కూడా తెలిసిన నాయకుడు మోదీ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడిని కలిగి ఉండటం భారతదేశం చేసుకున్న అదృష్టమని అన్నారు.
భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం నిరంతర శ్రమ
రాబోయే రోజుల్లో భావి తరాల భవిష్యత్తు, దేశం యొక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ ఎంతో శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆయనతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. ముగ్గురు నాయకుల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిందని పేర్కొన్నారు. మోదీ గారి 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కోవూరులో కూడా సేవా జ్యోతి యాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పాతికేళ్లుగా ఒక్కరోజు కూడా ఆగకుండా సాగిన మోదీ గారి ప్రజాసేవను స్మరించుకుంటూ, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సేవా జ్యోతి యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కష్టాల్లో ఉన్న గుజరాత్‌ను మార్చిన నాయకత్వం
మోదీ గారు బాధ్యతలు చేపట్టిన సమయంలో గుజరాత్ రాష్ట్రం అనేక కష్టాలను ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గుర్తుచేశారు. కచ్ భూకంపం వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసిందని, కరవుతో రైతులు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. గుక్కెడు నీటి కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవని, చీకటిలో పల్లెలు మగ్గిపోయేవని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులను చూసి మోదీ గారు వెనకడుగు వేయలేదని, వాటిని అధిగమిస్తూ గుజరాత్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడిగా మోదీ గారిని అభివర్ణించారు.
కూటమి పార్టీల సమన్వయంతో సేవా కార్యక్రమాలు
భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి సేవా జ్యోతి యాత్ర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ సేవా జ్యోతి యాత్ర ఆయన సేవా సంకల్పానికి అంకితమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించారు