ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన 8 వ డివిజన్ కార్పొరేటర్ శంకర్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు 8 వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 8 వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డివిజన్ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన బుధవారం తన సొంత నిధులతో డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్య కార్మికులకు తగిన సూచనలు అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శంకర్ మాట్లాడుతూ.. 8 వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా కార్పొరేటర్‌గా ఎన్నుకున్నందున, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల సహకారంతో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలతో పాటు వీధి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో 8 వ డివిజన్‌ను పరిశుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ శంకర్ తెలిపారు.