ప్రచారానికి తెర..! ప్రలోభాలతో ఎర!!
విజయనగరం బ్యూరో, సూర్య : జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల మైకుల హోరు తగ్గింది. ప్రచారానికి తెరపడింది గానీ, అసలైన "యుద్ధం" ఇప్పుడే మొదలైంది! మైకులు మూతపడగానే... మాయాజాలం మొదలైంది. వెలుగుల ప్రచారం ముగియగానే... చీకటి వ్యూహాలు పదునెక్కాయి. ఐదు గంటల సైరన్ మోగడంతోనే అభ్యర్థుల దృష్టి బహిరంగ వేదికల నుంచి ఓటర్ల ఇళ్ల తలుపుల వైపు మళ్లింది.
మైకులు బంద్... నోట్ల కట్టల సౌండ్!
మైకుల శబ్దం బందైన చోట ఇప్పుడు కరెన్సీ నోట్ల సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది. పోలింగ్‌కు ముందు దొరికే ఈ కొద్ది గంటల సమయాన్నే క్యాష్ చేసుకోవడానికి అభ్యర్థులు, వారి ప్రధాన అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వార్డులు, డివిజన్ల వారీగా "నెట్‌వర్క్" సిద్ధం చేసుకుని, ఓటర్ల సంఖ్యను బట్టి బడ్జెట్‌ను లెక్కగట్టి గుట్టుచప్పుడు కాకుండా పంపకాల పర్వానికి తెరతీశారు.
స్మార్ట్ 'డిజిటల్' ప్రలోభాలు
ఒకప్పుడు మద్యం సీసాలు, నోట్ల కట్టలు రాత్రికి రాత్రే ఇళ్లకు చేరేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది! ఆన్‌లైన్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్‌లు, డిజిటల్ కూపన్లు, గిఫ్ట్ వోచర్లు... పోలీసుల కళ్లకు గంతలు కొడుతూ ఓటరు పల్స్ పట్టుకునే కొత్త మార్గాలు పుట్టుకొచ్చాయి. మందు పానకాలు, దావత్‌లు..నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, సీక్రెట్ దాబాలు ఇప్పుడు హౌస్‌ఫుల్! మద్యం సీసాలు ఏరులై పారుతున్నాయి. గల్లీ నాయకులకు "రాత్రి బడ్జెట్" అప్పగించి, వార్డుల్లో ప్రతి ఓటునూ కొనుగోలు చేసేందుకు సీక్రెట్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, పోలీసుల చెక్‌పోస్టులు నిఘా పెంచామని చెప్తున్నా... అభ్యర్థుల "చీకటి ప్రచారం" మాత్రం అగ్గికి గాలి తోడైనట్లు సాగుతోంది. వాహన తనిఖీలను తప్పుదోవ పట్టించేందుకు పండ్ల బళ్ళు, కూరగాయల వ్యాన్లు, ఆటోల్లో రవాణా సాగిస్తూ తమ వినూత్న 'తెలివితేటలను' ప్రదర్శిస్తున్నారు.
సవాలుగా మారిన 'సైలెంట్ పీరియడ్
చట్ట ప్రకారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఉండే 48 గంటల 'సైలెంట్ పీరియడ్' ఓటరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశించింది. కానీ, ఈ విలువైన సమయాన్నే అభ్యర్థులు "ప్రలోభాల పీరియడ్"గా మార్చేశారు. నోటుకు ఓటు మభ్యపెడుతూ, ప్రచారంలో చెప్పని "ఆఫర్లను" రాత్రికి రాత్రే ఓటర్ల ముందుంచుతున్నారు.
"ఓటరు దేవుడా... కాస్త ఆలోచించు!
ఒక్క రాత్రి ఇచ్చే నోటు, తాగించే సీసా మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించలేవు. డ్రైనేజీ సమస్యలు, మంచినీటి కొరత, అధ్వాన్నమైన రోడ్లు... ఇవన్నీ బాగుపడాలంటే కావాల్సింది చీకటి ప్రచారానికి లొంగని నాయకుడు! అమ్ముడుపోయే ఓటు... మన మున్సిపాలిటీని, కార్పొరేషన్‌ను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం" అంటున్న ప్రజాస్వామ్యవాదుల గోడు అరణ్యరోధనే అవుతోంది.