ప్రభుత్వ ఆసుపత్రిలో కలాం జయంతి వేడుకలు హాజరైన ఎమ్మెల్యే, టీడీపీ నేతలు
పి.గన్నవరం మేజర్ న్యూస్ :అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మోకా ఆనందసాగర్, మండల టీడీపీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి లు పాల్గొని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి శాస్త్రవేత్తగా, క్షిపణి సాంకేతిక రంగంలో విశేష సేవలందించి, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.టీడీపీ ఇంచార్జ్ మోకా ఆనందసాగర్ మాట్లాడుతూ అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి,తన కృషి, పట్టుదలతో 'మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా భారత రాష్ట్రపతిగా ఎదిగి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు.
విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని, చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, కష్టపడి చదివి దేశాభివృద్ధికి తోడ్పడాలని మండల టీడీపీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.