పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
అడ్డతీగల, సూర్య ప్రతినిధి : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ అడ్డతీగల మండలంలో 22 పంచాయతీలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి స్థానిక జడ్పీ హైస్కూల్లో పోలింగ్ ఏర్పాట్లను రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వి రాజ్ కుమార్ పర్యవేక్షించి పరిశీలించారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, బందోబస్తు విషయంలో ఎన్నికల నిర్వహణలో అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాలని సబ్ కలెక్టర్ పృధ్వీరాజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 22 పంచాయతీల పరిధిలో ఉన్న 42 బూతులలో పోలింగ్ సామాగ్రి సిబ్బంది సకాలంలో చేరుకోవాలని అందుకు తగ్గ ఏర్పాట్లు పై స్థానిక ఎంపీడీవో కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటింగ్ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.