పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసుల నిరంతర సేవలు: జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం, సూర్య న్యూస్:దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. పోలీసుల నిస్వార్థ సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జాయింట్ కలెక్టర్, ఎస్పీకి సాయుధ పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల వివరాలతో కూడిన షహీద్ పుస్తక్ టోలిను ఆవిష్కరించి, అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
పోలీసుల సేవలు వెలకట్టలేనివి
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ, దేశ ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణే మూలస్తంభమని పేర్కొన్నారు. విపత్తులు, ఎన్నికలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు ముందుండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు పండుగలు, వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్న సమయంలోనూ పోలీసులు నిరంతరం ప్రజల భద్రత కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాలతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలకు గుర్తుగా ఈ సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ, ఉగ్రవాదం, మావోయిజం, అసాంఘిక శక్తులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల వీరమరణాన్ని దేశం ఎప్పటికీ మరువదని అన్నారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.
అమరవీరుల కుటుంబాలకు సన్మానం
బలిమెల దాడిలో వీరమరణం పొందిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పోలీసు అధికారి పి. సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో పాటు, గత ఏడాది కాలంలో జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ మరణించిన ఐకెడివి ప్రసాద్, ఎన్. కన్నయ్య, డి. ఏడుకొండలు, ఎస్.వి.వి.ఎస్. కృష్ణారావు, జి. విజయకృష్ణ కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ, భీమవరం ఆర్డీవో కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ల డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.