పొదలకూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
పొదలకూరు, మేజర్ న్యూస్ : రానున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని పొదలకూరు ఎస్సై శివ రాకేష్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ సూచనల మేరకు పొదలకూరు సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో మండలంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు, పొదలకూరు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.మండలంలోని సురాయపాలెం, విరువూరు, తాటిపర్తి తదితర సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పట్టణంలోని గేట్ సెంటర్ నుంచి సంగం రోడ్డు వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. అవసరమైన అదనపు పోలీసు బలగాలను నెల్లూరు జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై శివ రాకేష్ విజ్ఞప్తి చేశారు.