పంచాయతీ ఎన్నికలపై రాజా వ్యూహరచన
అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యం
ఎంపీటీసీ, జడ్పీటీసీ విజయోత్సాహంతో పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం
సీతానగరం సూర్య న్యూస్:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజానగరం నియోజకవర్గ పరిధిలో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇప్పటి నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, బలమైన అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సీతానగరం మండలంలో పార్టీ సీనియర్ నాయకుడు పెందుర్తి దేవదాస్ స్వగృహం వద్ద పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో జక్కంపూడి రాజా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు, రానున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సీతానగరం మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని రాజా పేర్కొన్నారు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలవడం, జనసేన పార్టీ పోటీ చేసిన ఆరు ఎంపీటీసీ స్థానాల్లో ఐదు స్థానాల్లో పరాజయం చవిచూడటం స్థానిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందని రాజా అన్నారు.మెజారిటీ ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ పీఠాన్ని, జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణకు నిదర్శనమని వివరించారు. ఈ విజయాలను కేవలం ఎన్నికల ఫలితాలుగా కాకుండా, గ్రామస్థాయిలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచుకునేందుకు లభించిన అవకాశంగా భావించాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించిన సమష్టి కృషి, సమన్వయాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకమని రాజా స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని, ప్రతి గ్రామంలోనూ స్థానిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో వివిధ సామాజిక వర్గాలకు ఉన్న ప్రాధాన్యత, ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న ఆదరణ, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ నేపథ్యం, స్థానికంగా ప్రజా సమస్యలపై వారి అవగాహన, ప్రజలతో ఉన్న సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిగత అభిప్రాయాలు, వర్గ విభేదాలకు తావివ్వకుండా పార్టీ విజయావకాశాలే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిం చారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి స్థానిక నాయకులతో చర్చించి, గెలుపు అవకా శాలపై సమగ్రంగా అంచనా వేసిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు కీలకమైన అవకాశమని రాజా అన్నారు. గ్రామాల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు, ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై నిరంతరం స్పందించాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన విజయాలను పునాదిగా చేసుకుని పంచాయతీ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించా లన్న లక్ష్యంతో జక్కంపూడి రాజా ముందస్తు వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితు లను అంచనా వేస్తూ, బలమైన అభ్యర్థులను సిద్ధం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయ పరచడం ద్వారా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగిం చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.