ఫీజుల వసూళ్ల పై వస్తున్న వదంతులను నమ్మొద్దు
ఎస్వీ సెట్ వైస్ ఛాన్సులర్ డాక్టర్ మోహన్ బాబు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నగరం లోని స్థానిక ఎస్వీ సెట్ యూనివర్సిటీ పై సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎస్వీ సెట్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డాక్టర్ మోహన్ బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎస్వి సెట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ వర్సిటీలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారని కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగిందన్నారు. ఇది పూర్తి అవాస్తమన్నారు. గురువారం తమ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందన్నారు. అదే విధంగా శుక్రవారం కళాశాల యాజమాన్యం కూడా కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటనపై ఫీజు రియంబర్స్మెంట్ వివరాలను తీసుకువెళ్తామన్నారు. ఎటువంటి అదనపు రుసుము లేకుండా విద్యార్థులు పరీక్షలు వ్రాయవచ్చని తెలిపారు. మౌనిక అనే విద్యార్థిని అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యంగా ఉందన్నారు. అయితే స్రవంతి అనే పేరు గల విద్యార్థిని తమ కళాశాలలోనే లేదన్నారు. కావాలని కొంత మంది పుకార్లు సృష్టించి మౌనిక మృతి చెందినట్లు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అలాంటి పుకార్లను నమ్మవద్దని, అదే క్రమంలో ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా బాగా చదువుకొని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. కాగా ఈ సమావేశంలో ఎస్పీ సెట్ కళాశాల ప్రిన్సిపాల్ వైఎన్ విజయ్ కుమార్, రిజిస్టార్ లోకనాథరెడ్డి, కళాశాల లోని అన్ని విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.