పెనుగొండ సీహెచ్‌సీలో శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించాలి : సిపిఎం మండల కార్యదర్శి షేక్ పాదుషా డిమాండ్
వాసవి పెనుగొండ, సూర్య న్యూస్:స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో శాశ్వత గైనకాలజిస్ట్‌ను నియమించి గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి షేక్ పాదుషా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెనుగొండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి. అనిత కుమారికి ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాదుషా మాట్లాడుతూ, సీహెచ్‌సీలో శాశ్వత గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారానికి రెండుసార్లు మాత్రమే గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండటంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు బయట కొనుగోలు చేయాల్సిన మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారని, దీంతో రోగులపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. అవసరమైన మందులన్నింటినీ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.సిపిఎం గ్రామ కార్యదర్శి నాగిశెట్టి గంగారావు మాట్లాడుతూ అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలను బయట చేయించుకోవాలని సూచించడం వల్ల పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అవసరమైన ల్యాబ్ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్వహించేలా సౌకర్యాలు కల్పించాలని కోరారు.పెనుగొండ సీహెచ్‌సీకి రోజుకు 300 మందికి పైగా ఔట్‌పేషెంట్లు వస్తున్నందున, వారి అవసరాలకు అనుగుణంగా వైద్యులు, మందులు, ల్యాబ్ పరీక్షలను అందుబాటులో ఉంచాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రిపోర్టర్: పి.వెంకట్రామయ్య , పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా