పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి
ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మెన్స్ హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ నాయక్ ఆవేధన వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీలో మంగళవారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ ఎస్వీయూలో పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇప్పటికీ సకాలంలో హాస్టల్ వసతి కల్పించకపోవడం బాధాకరమన్నారు. హాస్టల్ అడ్మిషన్ చలానాలు, ఫీజులు విద్యార్థులు చెల్లించినప్పటికీ, దసరా సెలవుల అనంతరం హాస్టల్ వసతి కల్పిస్తామని అధికారులు చెప్పడం విద్యార్థులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడాల్సిన మౌలిక వసతుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం గతంలో వినియోగంలో ఉన్న హెచ్ బ్లాక్ ను గత రెండు సంవత్సరాలుగా మూసివేయడంతో పీజీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు ఒకే బ్లాక్ లో వసతి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హాస్టల్ వసతి సకాలంలో లభించకపోవడం వల్ల పలువురు విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది విద్యార్థులు అసౌకర్యం కారణంగా చదువును కొనసాగించడంపై కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఇప్పటికైనా ఎస్వీయూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పీజీ విద్యార్థులందరికీ సౌకర్యవంతమైన హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి