పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
పేద విద్యార్థినికి అండగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
బీ ఫార్మసీ విద్యార్థిని మంజులకు రూ.30 వేల ఆర్థిక సాయం
ఒకే తండాకు చెందిన ఐదుగురు విద్యార్థినుల ఉన్నత విద్యకు చేయూత.
శెట్టూరు: పేదరికం కారణంగా విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలగకూడదనే లక్ష్యంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శెట్టూరు మండలం మాకొడికి తాండాకు చెందిన పేద విద్యార్థిని మంజులకు ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సహాయం అందించి ఆమె చదువుకు అండగా నిలిచారు. మాకొడికి తాండాకు చెందిన సక్రె నాయక్, సాలమ్మ దంపతుల కుమార్తె మంజుల అనంతపురం పట్టణంలోని ఓ ప్రముఖ కళాశాలలో బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కళాశాల ఫీజు రూ.38 వేల చెల్లించలేక ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫీజు బకాయి కారణంగా పరీక్షలకు హాజరయ్యే విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ వెంటనే స్పందించి విద్యార్థినికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి విద్యార్థిని పరిస్థితిని వివరించారు. ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజుల గడువు ఇవ్వాలని కోరడంతో కళాశాల యాజమాన్యం ఆమెకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. అనంతరం కళాశాల పేరుతో రూ.30 వేల చెక్కును విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందజేసి ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇదిలా ఉండగా, బద్దే నాయక్ సేవా కార్యక్రమాలు ఒక్క మంజులకే పరిమితం కాలేదు. అదే మాకొడికి తాండాకు చెందిన మరో నలుగురు విద్యార్థినులతో కలిపి మొత్తం ఐదుగురు బాలికల ఉన్నత విద్యకు ట్రస్ట్ సహకారం అందిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినుల చదువులు మధ్యలో ఆగిపోకుండా వారికి అవసరమైన తోడ్పాటును అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ట్రస్ట్ చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. చదువుకు పేదరికం అడ్డంకి కాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు సమాజం అండగా నిలవాలని ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మహేష్, వన్నప్ప, శ్రీధర్ పాల్గొన్నారు.
ఖాసీం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.