పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి విజయవాడ నగరపాలక సంస్థతో పాటు కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రాక, ఓటింగ్ శాతం, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించి పరిష్కరించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలోని ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత సైతం ఎన్నికల్లో భాగస్వాములవుతూ ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక నిఘా ఉంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
పోలింగ్ కేంద్రాల్లో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలు
ప్రజాస్వామ్య పండుగలో యువత తమ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల్లో సేవలందిస్తున్నారు. ఓటర్లకు స్వాగతం పలకడం, క్యూలైన్ల క్రమబద్ధీకరణలో సహకరించడం, వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా తోడ్పడుతూ పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు యువ వాలంటీర్లు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.