పట్టణ అభివృద్ధి నా ధ్యేయం యువ చైర్మన్ నాగసారపు రూపేష్ గుప్తా పలు వార్డుల్లో నగసరపు రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తా విస్తృత ప్రచారం
నరసరావుపేట : మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి నగసరపు రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తా 24, 44, 39, 23వ వార్డుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపేష్ గుప్తా మాట్లాడుతూ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈసారి నరసరావుపేట మున్సిపాలిటీలో కూటమి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజలు తమను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం, హిందూ సోదరులు కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉంటూ తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగితే కూటమి అభ్యర్థుల బలమేమిటో స్పష్టమవుతుందని రూపేష్ గుప్తా పేర్కొన్నారు. ఈ నెల 26న జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట పట్టణంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని రూపేష్ గుప్తా హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వన్‌వే విధానం లేదా బైపాస్ మార్గం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తామని బైపాస్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని వెల్లడించారు. మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను రూపేష్ గుప్తా కోరారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…