కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో ఖర్చు చేయాలి* *రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి* *ఎరువుల బుకింగ్‌కు సంబంధించి ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి* *రైతులకు సంబంధించిన ఫార్మర్ ఐడీల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 23:- కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మంజూరైన నిధులను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అంశాల పై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యూట్రి సిరియల్స్ (పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు) పథకం కింద ఇప్పటివరకు 47 శాతం మాత్రమే ఖర్చు చేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నిధుల వినియోగాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పొలం బడి కార్యక్రమానికి సంబంధించిన మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని, మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కింద మంజూరైన రెండో విడత బడ్జెట్‌ను వెంటనే బుక్ చేయాలన్నారు. సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ, రైతు సేవా కేంద్రాల నిర్వహణకు సంబంధించిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించి, ఖర్చుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు, వాటి పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. రైతులు విత్తనాలు కోరుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారికి అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.. ఎరువుల విక్రయాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్.ఎఫ్.ఎస్. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడం, పంట రుణాల పంపిణీ వేగవంతం చేయడం, వ్యవసాయ సేవలను మరింత చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు..పంటల నష్టానికి సంబంధించిన వివరాలను మండలాల వారీగా సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు..జిల్లాలో రైతులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫార్మర్ ఐడీల నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం అనుబంధ శాఖల కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, సిపిఓ భారతి, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి , పశుసంవర్ధక శాఖ అధికారి డా.రాజశేఖర్, మార్కెటింగ్ ఏడి నారాయణ మూర్తి, మత్స్య శాఖ అధికారి రంగనాథ్ బాబు, న్యాచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, తదితరులు పాల్గొన్నారు.