andhrapradesh
జన్మదినం నాడే కౌన్సిలర్ గా పదవీ బాధ్యతలు.. అద్దంకిలో కౌన్సిలర్ చిన్ని మానసకు అభినందనల వెల్లువ.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ చిన్ని మానస హనుమ ఇంట నేడు డబుల్ ధమాకా నెలకొంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆమె, నేడు మున్సిపల్ కార్యాలయంలో వార్డు సభ్యురాలిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. యాదృచ్ఛికంగా నేడు ఆమె జన్మదినం కూడా కావడంతో పార్టీ శ్రేణులు, స్థానికులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం 19వ వార్డులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్ని మానస కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిన్ని మానస హనుమా దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి పదవీ బాధ్యతలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు, మాజీ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్, 18వ వార్డు కౌన్సిలర్ గుంజి రమణ, మామిడి రాంబాబు, పొట్టి వెంకటశివరావు, నూకల రామాంజనేయులు, చిన్ని ప్రసాదు, చిన్ని వాసు, మిరియాల శ్రీకాంత్, కురిచేటి మహేష్ తదితర ఆర్యవైశ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కౌన్సిలర్ చిన్ని మానస పేర్కొన్నారు.