కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లులో అభివృద్ధి పరుగులు!
కూటమి ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లులో అభివృద్ధి పరుగులు!
- విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
- భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం
- సర్పంచ్ అభ్యర్థి మద్దికుంట నర్మదాను భారీ మెజార్టీతో గెలిపించండి: టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓర్వకల్లు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని టీడీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి తెలిపారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కేజీబీవీ, మోడల్ స్కూల్కు వెళ్లే రహదారుల అభివృద్ధి, నూతన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఏర్పాటు, బీసీ వసతి గృహం మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. హెల్త్ సెంటర్ల అభివృద్ధితో పాటు మైనార్టీల కోసం షాదీఖానా నిర్మాణానికి 36 సెంట్ల స్థలం కేటాయించినట్లు వెల్లడించారు.
పల్లె పండుగ మొదటి విడతలో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, జల్ జీవన్ మిషన్ కింద రూ.42 లక్షలతో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నిర్మించినట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న ఆర్అండ్బీ రహదారి సమస్యకు పరిష్కారం చూపామని, సుమారు రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు చెప్పారు. పిండకండి నగర్లో రూ.20 లక్షలతో డ్రైనేజీ సదుపాయాలు కల్పించామని, తాగునీటి అవసరాల కోసం గ్రామంలో నాలుగు నుంచి ఐదు బోరు పాయింట్లు ఏర్పాటు చేసినట్లు గోవిందరెడ్డి వివరించారు.
మరిన్ని అభివృద్ధి పనులకు నర్మదాకు అవకాశం ఇవ్వండి
గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గోవిందరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా మద్దికుంట నర్మదా పోటీలో ఉన్నారని, ఆమెను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీ హనుమన్న, టీడీపీ నాయకులు లక్ష్మీకాంతారెడ్డి, జీకే అల్లాబాబు, ఏసేపు, సర్పంచ్ అభ్యర్థి మద్దికుంట నర్మదా, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.