కోబాల్ట్ ఎగుమతులపై కాంగో మరోసారి నిషేధం
సూర్య బిజినెస్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో కోబాల్ట్ అధిక సరఫరాను అదుపులోకి తెచ్చి, ధరలకు మద్దతు కల్పించే లక్ష్యంతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కోబాల్ట్ ఎగుమతులపై మరోసారి తాత్కాలిక నిషేధం విధించేందుకు సిద్ధమైంది. వచ్చే వారం నుంచి కోబాల్ట్ హైడ్రాక్సైడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సమాచారం. వ్యూహాత్మక ఖనిజ పదార్థాల మార్కెట్ల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థ ఏఆర్ఈసీఓఎంఎస్ అధ్యక్షుడు పాట్రిక్ లువాబేయా సంతకం చేసిన ప్రకటన ప్రకారం, నవంబర్ 9న జరిగిన సమావేశంలో ఈ తాత్కాలిక నిలిపివేతకు ఆమోదం లభించింది.
ప్రపంచ మార్కెట్లో సరఫరా, డిమాండ్ సమతుల్యత, అందుబాటులో ఉన్న నిల్వలు మరియు కోబాల్ట్ మార్కెట్ పరిణామాలను సమీక్షించేందుకు నాలుగు నెలల తర్వాత ఈ నిషేధంపై పునఃసమీక్ష నిర్వహించాలని నియంత్రణ సంస్థ నిర్ణయించింది. అలాగే కోటా కేటాయింపు విధానాన్ని కూడా ఈ విరామ సమయంలో సమీక్షించి సవరించనుంది. అంతర్జాతీయంగా కోబాల్ట్ ధరలు పడిపోతున్న నేపథ్యంలో కాంగో ప్రభుత్వం ఈ చర్యకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో 2025 ఫిబ్రవరిలో కాంగో తొలిసారిగా విస్తృత స్థాయిలో కోబాల్ట్ ఎగుమతులపై నిషేధం విధించింది. ఎనిమిది నెలల తర్వాత ఆ నిషేధాన్ని తొలగించి కఠినమైన ఎగుమతి కోటా విధానాన్ని అమలులోకి తీసుకురాగా, తాజాగా మరోసారి ఎగుమతులను నిలిపివేసే నిర్ణయం తీసుకుంది. కాంగోలో రాగి తవ్వకాల అనుబంధ ఉత్పత్తిగా కోబాల్ట్‌ను వెలికితీస్తుండగా, సీఎంఓసీ గ్రూప్, గ్లెన్‌కోర్, యురేషియన్ రిసోర్సెస్ గ్రూప్ వంటి సంస్థలు ప్రధాన ఎగుమతి కోటాలను కలిగి ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో వినియోగించే రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కోబాల్ట్ కీలకంగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి గిరాకీ బలహీనంగా ఉండటంతో పాటు సరఫరా ఒత్తిడి నెలకొన్న తరుణంలో కాంగో నిర్ణయం అంతర్జాతీయ సరఫరా గొలుసుపై ప్రభావం చూపనుంది. మరోవైపు కాంగో ఆంక్షల వల్ల రెండో అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారు అయిన ఇండోనేషియాకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.