పట్టాలతో పేదలకు పట్టాభిషేకం
పట్టాలతో పేదలకు పట్టాభిషేకం
డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రూ.28,112 కోట్ల విలువైన 707ఎకరాల భూములకు హక్కులు
విమెన్ వర్క్ ఫోర్సులో అగ్రస్థానంలో విశాఖ, విజయవాడ
కూటమి ప్రభుత్వ ప్రతి అడుగూ స్వర్ణాంధ్ర సాధన వైపే
ప్రభుత్వం చేసే అభివృద్ధికి అడ్డు పడటమే గొడ్డలి పార్టీ పని
ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ బ్యూరో, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్) : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు వేసిన ప్రతీ ఓటుకూ న్యాయం చేస్తూ ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడుతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భూములకు హక్కులు కల్పిస్తూ పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ర్యాంపుపై మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తో కలిసి నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.." విశాఖపట్నంలో 28 వేల మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. ఇప్పుడు విజయవాడలో 26,401 వేల మంది కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నాం. మొత్తం కలిపి ఇప్పటి వరకూ 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. రూ.52 వేల కోట్ల విలువైన భూముల్ని పేదలకు ఇవ్వటం సంతోషంగా ఉంది. పేదలకు జరుగుతున్న పట్టాభిషేకం ఇది. విజయవాడలో ఇస్తున్న భూముల విలువ రూ.28,112 కోట్లుగా ఉంది. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించాం. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఉంటుంది. ఇదే పేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం. దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించి మీ స్థలాలకు హక్కుల కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పేదలకు పట్టాలు వచ్చేలా కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నా. గత పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను భవిష్యత్తు కోసం జాగ్రత్తగా కాపాడుకోవాలని అందరికీ సూచిస్తున్నాను. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. విశాఖ, వట్టిచెరుకూరు, కంగుమంది, కైకలూరు, అమలాపురం లాంటి చోట్ల ఉన్న ఈ తరహా సమస్యల్ని పరిష్కరించి పట్టాలు ఇచ్చాం." అని ముఖ్యమంత్రి అన్నారు.
అభివృద్ధికి గొడ్డలి పార్టీ అడ్డంకులు
"201924లో గత పాలకులు ప్రతి ఇంట్లోనూ ఆస్తుల వివాదాలు సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై వారి బొమ్మలేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఇబ్బందులు సృష్టించారు. సర్వేరాళ్లపై బొమ్మలు వేసుకోడానికి రూ.800 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బులు ఉంటే పేదలకు మరింత సంక్షేమం జరిగేది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూములన్నిటిని రీసర్వే చేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఎలాంటి వివాదాలు లేని కొత్త వ్యవస్థను తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టి అనేది నిరంతరం జరిగేలా వివిధ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. వైసీపీ రాక్షసులు పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డంపడ్డారు. కానీ పట్టుదలతో ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పటికే 490 టీఎంసీల నీటిని తీసుకువచ్చాం. ఎల్ నినో కారణంగా కృష్ణా నదిలో శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీకి నీరే రాలేదు. పట్టిసీమ నుంచి నీరు తెచ్చి డెల్టా ప్రాంతానికి నీరు ఇచ్చాం. విజయవాడకు కూడా నీటి సమస్య లేకుండా చేయగలిగాం. గోదావరి నదిలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 1400 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. రోజుకు 75 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోంది. అందులో ఓ 100 టీఎంసీలు తెచ్చుకుంటే అంతా సస్యశ్యామలం అవుతుంది. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేసి గ్రావిటీపై తీసుకువస్తాం. కృష్ణా డెల్టాలో పొదుపు చేసిన నీటిని రాయలసీమ ప్రాంతానికి ఇస్తాం. అన్ని ప్రాంతాలకూ తాగు, సాగునీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. మనతో పాటు మన పొరుగు రాష్ట్రాల వారు కూడా బాగుండాలన్నదే మా సిద్దాంతం. గోదావరి కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నీటి కొరతే రాదు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేలకోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. 2028 కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణాగోదావరి నీళ్లు పుష్కలంగా మనకు వస్తాయి" అని సీఎం వ్యాఖ్యానించారు.
మహిళా వర్క్ ఫోర్సులో ఏపీ కీలకం
"అభివృద్ధి భవిష్యత్తులో సంపద సృష్టికి అవసరం. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు. ప్రజల ఆదాయాన్ని పెంచేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదల సంక్షేమం మా మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఠంచనుగా మొదటి తేదీనే వారికి పెన్షన్ ఇస్తున్నాం. స్త్రీశక్తి ద్వారా ఆడబిడ్డలకు డబ్బులు ఆదా అవుతున్నాయి. గత పాలకులు రూ.32 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీల భారం వేశారు. మేం ట్రూ డౌన్ చేసి విద్యుత్ భారం తగ్గించాం. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. మత్స్యకారుల సేవలో, ఆటోడ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు చేయూత అందుతోంది. వడ్డెర్లు, గీత కార్మికులకు కూడా సహకారం అందిస్తున్నాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా పీ4 కార్యక్రమం తీసుకువచ్చాం. కుప్పంలో ఓ సాధారణ మహిళను టీవీఎస్ కంపెనీ దత్తత తీసుకుంది. నిన్నటి వరకూ కూలీగా ఉన్న ఆ మహిళ ఇటుకల బట్టీ యూనిట్ ను ఏర్పాటు చేసుకుని 20 మందికి ఉపాధి అందిస్తోంది. కేంద్ర గణాంకశాఖ విమెన్ వర్క్ ఫోర్సుపై ఓ నివేదిక విడుదల చేసింది. విశాఖ మొదటి స్థానంలో ఉంది. ప్రతీ వంద మందిలో 42 మంది మహిళలు ఉన్నారు. విజయవాడలో ప్రతీ వంద మందిలో 37 మంది పనిచేస్తున్నట్టు వెల్లడైంది. పారిశ్రామిక వేత్తలుగా ప్రతీ వంద మందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులను స్వయం బ్రాండ్ కింద మార్కెటింగ్ చేయిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందించే వచ్చే ఏడాదిలోగా మరో 5.5 లక్షల ఇళ్లు ఇస్తాం. పేదలందరికీ ఇంటిజాగా, ఇల్లు, తాగునీటికి కుళాయి ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని" సీఎం వ్యాఖ్యానించారు.
గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో ఏపీ నగరాలు
పురాణ కాలంలో రాజులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు అడ్డుపడే వారు. ఇప్పుడు గొడ్డలి పార్టీ అదే పనిచేస్తోంది. పేదలకు పట్టాలు ఇస్తుంటే ఎలా ఇస్తారంటూ గొడ్డలి పార్టీ అడ్డుపడుతోంది. ఇలా ఏ పనిచేసినా ఆ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణాల్ని కూడా ఆ పార్టీ అడ్డుకుంటోంది. ప్రపంచ బ్యాంకులు లేఖలు రాశారు. చెరుకు తోటలు తగులబెట్టారు. ఇలా నానా విన్యాసాలు చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుకునేందుకు ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారు. చెరుకు తోటలు తగలబెట్టారు. నానా విన్యాసాలు చేశారు. మూడు రాజధానులని, అమరావతి శ్మశానమని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత వచ్చిన రోజే మావిగన్ అంటూ కొత్త ఆటలు మొదలు పెట్టారు. మావిగన్ అంటే విజయవాడలో ఉన్నవారికైనా అర్ధం అయ్యిందా అని ప్రశ్నిస్తున్నా. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అత్యుత్తమ రాజధాని నగరంగా తయారవుతుంది. విజయవాడకు, అమరావతికి అందం తెచ్చిపెట్టేది నీళ్లే. ఇది బ్లూ సిటీ, 50 శాతం పచ్చదనంతో కళకళలాడేలా నగర నిర్మాణం జరుగుతోంది. రాజధాని అమరావతిలో వినియోగించే విద్యుత్ అంతా గ్రీన్ ఎనర్జీనే. నెట్ జీరోగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం. విజయవాడ, గుంటూరులో భూములకు విలువ పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ల ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. బుల్లెట్ ట్రైన్ సహా, 4 లేన్ రైల్వే లైన్ వస్తుంది. అమరావతివిజయవాడగుంటూరు ఒకే నగరంగా తయారవుతాయి. మన విజయవాడ ప్రపంచంలోని వెయ్యి నగరాల్లో చోటు సంపాదించింది. నాణ్యమైన జీవన ప్రమాణాలు, మానవ వనరులు, పర్యావరణం లాంటి అంశాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖ చోటు సంపాదించాయి. విజయవాడ నగరంలో కాలుష్యం లేకుండా వాటర్ స్ప్రేయింగ్ చేయిస్తున్నాం. విజయవాడ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ తో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మచిలీపట్నంలో గోవాషిప్ యార్డు షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మిస్తోంది. రూ.8 వేల కోట్ల పెట్టుబడులతో ఈ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ప్రకాశం బ్యారేజి ఎగువన దిగువన వైకుంఠపురం, చోడవరం దగ్గర బ్యారేజీలను నిర్మించి నీటిని నిల్వచేస్తాం. అమరావతికి కనెక్టివిటీ పెరిగేలా వెస్ట్ బైపాస్ తో పాటు మరో బ్రిడ్జి కూడా నిర్మాణం చేస్తాం. రూ.50 వేల కోట్లతో పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేల కోట్లతో పనులు ప్రారంభించాం
ఒక్క కియా ప్రాజెక్టు అనంతపురంలో, వెలిగొండ మార్కాపురంలో, భోగాపురం విజయనగరంలో మార్పులు తీసుకువస్తున్నాయి. అమరావతి ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్, రైల్ నెట్వర్క్‌లు పూర్తై అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని ముఖ్యమంత్రి అన్నారు.
పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
"201924 మధ్య కాలంలో విభజన కంటే ఎక్కువగా రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఇప్పుడు ఆ కష్టనష్టాలను అధిగమించి వికాసం వైపు మనం ముందడుగు వేస్తున్నాం. ప్రతీ అడుగు స్వర్ణాంధ్ర సాధన దిశగా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక ఎవరి వల్లా రాష్ట్రం నష్ట పోకూడదనే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా మేం పనిచేస్తున్నాం. మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా బలమే శ్రీరామ రక్షగా 2024లో మేం అధికారంలోకి వచ్చాం. గొడ్డలి పార్టీని చిత్తుగా ఓడించి శాశ్వతంగా సమాధి చేయాలని కోరుతున్నా .ప్రభుత్వం చేసిన మంచి గురించి ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. పేటిఎం బ్యాచ్‌ల రీల్స్‌తో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. లబ్దిపొందిన వారంతా అనుభవాలు పంచుకుంటే సోషల్ మీడియా బద్దలవుతుంది. గతంలో సీఈఓ సీఎం అని పిలిచినా కలగని ఆనందం వాటర్ మాన్ అంటూ చేసిన వ్యాఖ్యతో కలిగింది. పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు, తాగు నీరందిస్తున్నందుకు వాటర్ మాన్ అంటూ పత్రికలు రాశాయని" సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ సహా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.