పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*
కర్నూలు, నవంబర్ 12: జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ ఏడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు, బడి మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.
గురువారం సునయన ఆడిటోరియంలో కర్నూలు విద్యా డివిజన్ పరిధిలోని పదో తరగతి పబ్లిక్ పరీక్షల వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...గత ఏడాది పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరంతర అభ్యసనం, స్లిప్ టెస్టులు, ప్రత్యేక పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని సుమారు 10 శాతం పెంచగలిగామని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో మంచి ఉత్తీర్ణత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఈ లక్ష్య సాధనలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగల శక్తి ఉపాధ్యాయులకు ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో వలసలు,ఇతర కారణాలతో మధ్యలోనే చదువు మానేసి తిరిగి పాఠశాలలకు రాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి పాఠశాలలో బడి మానేసిన విద్యార్థుల వివరాలను గుర్తించి, ఒక్కో పాఠశాల పరిధిలో ఉన్న సుమారు ఏడెనిమిది మంది విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలలోని ఇద్దరు లేదా ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, విద్యార్థుల ఇళ్లకు పంపించాలని సూచించారు. తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రానున్న పది రోజులను ప్రత్యేక డ్రైవ్‌గా నిర్వహించి, సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. కనీసం 70 శాతం మంది విద్యార్థులనైనా తిరిగి పాఠశాలలకు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ప్రతిరోజూ విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తూ, గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
*వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి*
గణితం, ఆంగ్లం, సైన్స్ తదితర సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రెమెడియల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థికి రోజువారీగా రెండు పాఠాలు లేదా నిర్ణీత అంశాలపై హోంవర్క్ ఇవ్వాలని, మరుసటి రోజు వాటిపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయాలని సూచించారు. అవసరమైతే ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ద్వారా కూడా వారి ప్రగతిని పరిశీలించాలని తెలిపారు. 'రైజింగ్ స్టార్స్'గా ఉన్న విద్యార్థులను మరింత ప్రోత్సహించి 'షైనింగ్ స్టార్స్' స్థాయికి తీసుకురావాలని పేర్కొన్నారు. పదో తరగతి సిలబస్‌ను నవంబర్ నెలాఖరులోగా అన్ని పాఠశాలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు ఫార్మేటివ్ అసెస్‌మెంట్లు పూర్తయ్యాయని, మరో రెండు మాత్రమే మిగిలి ఉన్నందున అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిలబస్ పూర్తి చేయడంతో పాటు పరీక్షలకు విద్యార్థులను సమగ్రంగా సిద్ధం చేయాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా బోధన, ఉదయం–సాయంత్రం స్టడీ అవర్స్, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. హెడ్‌మాస్టర్లు కీలక బాధ్యత తీసుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలన్నారు..
*మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి*
పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎంతో ముఖ్యమని, నాణ్యమైన భోజనాన్ని నిర్దేశించిన మెనూ ప్రకారం సకాలంలో అందించడం ప్రధాన బాధ్యతగా భావించాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర మౌలిక వసతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తల్లిదండ్రుల నుంచి పాఠశాలలపై సానుకూల అభిప్రాయం వచ్చేలా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. సమాజంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు, బడి మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావడం అనే రెండు ప్రధాన లక్ష్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి జి. సుధాకర్, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ లోకరాజు, డిప్యూటీ డిఈవో శ్రీధర్ బాబు, కర్నూలు డివిజన్ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.