పారిశుధ్య కార్మికులు పనితోపాటు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి
కనిగిరి ,మేజర్ న్యూస్ :పారిశుధ్య కార్మికులు పనితో పాటు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పారిశుధ్య కార్మికుల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ అన్నారు. బుధవారం కనిగిరి పురపాలకసంఘము ఆధ్వర్యంలో మునిసిపల్ కమీషనర్ పర్వతనేని శ్రీధర్ ఆదేశాలతో సఫాయి మిత్ర సురక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ కార్మికులు అరోగ్యంగా ఉంటేనే పట్టణాలు సౌభాగ్యంగా ఉంటాయన్నారు. శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో మునిసిపల్ కార్మికులకు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఆరోగ్యం బాగుండాలని వారు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. కార్మికుల ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు నిర్వహించుకుని వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలన్నారు. సుమారు 120 మందికి బి.పి. షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫణికుమార్, హెల్త్ అసిస్టెంట్ చేన్నకేశవులు, భాస్కర్, పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగుయువత అధ్యక్షులు అచ్చాల రవి ,షేక్ జంషీర్ ,మునిసిపల్ సిబ్బంది సాయి కృష్ణ, పుట్టా సుబ్రహ్మణ్యం, అర్బన్ కేంద్రాల వైద్య సిబ్బంది, మున్సిపల్, సచివాలయ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.