ఒంగోలు నగర మేయర్ గా శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు పిలుపునిచ్చారు. ఒంగోలు టిడిపి మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో పాటు 62 డివిజన్లలోని కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.ఒంగోలు నగరంలోని ఏ1 ఫంక్షన్ హాల్‌లో బుధవారం మధ్యాహ్నం ఒంగోలు నగర ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ బీఎన్ విజయ్ కుమార్ గారు, ఉడా చైర్మన్, జనసేన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాస్ గారితో పాటు టిడిపి, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారు మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేయాలని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తూ పార్టీ గుర్తును ఉపయోగించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో యువతకు, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి అధిక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికీ, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా ఒంగోలు నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగేందుకు మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సూచించారు.ఈ సమావేశంలో ఒంగోలు నగరానికి చెందిన టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…