నిరాడంబరతకు, నిజాయితీకి ప్రతిరూపం ఎస్.ఆర్. శంకరన్
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శంకరన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ గురువారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 1934 అక్టోబర్ 22న తమిళనాడులో జన్మించిన శంకరన్, 1957లో ఐఏఎస్ అధికారిగా ఎంపికై వివిధ హోదాల్లో సేవలందించారు. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఆయన, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. ఉన్నత పదవుల్లో పనిచేసినప్పటికీ సాధారణ జీవనశైలిని అనుసరించారని, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. 1992లో పదవీ విరమణ చేసిన అనంతరం కూడా పేదల హక్కుల పరిరక్షణకు కృషి చేశారని పేర్కొన్నారు. శంకరన్ సేవలను స్మరించుకుంటూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఒక హాల్‌కు ఆయన పేరు పెట్టినట్లు తెలిపారు. 2010 అక్టోబర్ 7న ఆయన మరణించినప్పటికీ, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకితభావం నేటికీ అధికారులకు, ప్రజలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.