టీజీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేటలో ఆంక్షలు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు
సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–II), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించనున్న పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.
ఈ నెల 24న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–II), 26న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)–2023లోని సెక్షన్ 163 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు
పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించినట్లు కలెక్టర్ తెలిపారు. కర్రలు, కత్తులు, లాఠీలు, ఇతర హానికరమైన ఆయుధాలు లేదా వస్తువులను తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
అలాగే పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు, సైబర్ కేఫ్‌లను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని సూచించారు.
ఈ ఆంక్షలు అక్టోబర్ 24, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా పరీక్ష పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
సూర్య న్యూస్ : సిద్దిపేట అర్బన్, దేవులపల్లి భూపతి