"నీచ వ్యాఖ్యల పై మౌనమెందుకు - కాకాణి పూజిత"
నెల్లూరు, మేజర్ న్యూస్ :
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యులపై జనసేన కార్యకర్తలు ఎక్స్ స్పేస్‌ల వేదికగా అత్యంత నీచమైన, సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా కూటమి నాయకుల నుంచి కనీసం అవి తప్పు అనే ఒక్క ప్రకటన కూడా రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మహిళా నాయకులతో కలిసి నెల్లూరులోని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలను కూటమి నాయకులు సమర్థిస్తున్నారా? లేక వారి మౌనంతోనే ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత దారుణమని మండిపడ్డారు. సైబర్ బుల్లీయింగ్ అనేది చిన్న విషయం కాదని, మహిళలు, యువత, చిన్నారులు సైతం ఇలాంటి వేధింపుల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు ఇలాంటి దాడులను అడ్డుకోవాల్సింది పోయి, తమ కార్యకర్తలతోనే చేయించడం ప్రజాస్వామ్యానికి, మహిళల గౌరవానికి విరుద్ధమని కాకాణి పూజిత పేర్కొన్నారు.
ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే...
రాజకీయ విమర్శలు చేస్తే స్వాగతిస్తాం:
వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యులపై జనసేన కార్యకర్తలు ఎక్స్ స్పేస్‌లను నిర్వహించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి ఆధారాలతో నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఈ స్పేస్‌లను నిర్వహించిన వ్యక్తులు ఎవరు, వాటిలో పాల్గొన్నవారు ఎవరు, ఏయే సందర్భాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే పూర్తి వివరాలను పోలీసులకు అందజేశాం. ఫిర్యాదును స్వీకరించి రసీదు ఇవ్వడం సానుకూల పరిణామంగా భావిస్తున్నాం. అయితే ఫిర్యాదు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లో ఉన్న మహిళలను విమర్శించాలనుకుంటే రాజకీయ అంశాలపై విమర్శలు చేసుకోవచ్చు, అంతేకానీ రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను, మహిళలను వ్యక్తిగతంగా దూషించే హక్కు ఎవరికీ లేదు. ఇంట్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా ఇష్టానుసారంగా దూషించవచ్చనే ధోరణి పెరిగితే రాబోయే తరాలకు మనం ఎలాంటి విలువలు నేర్పగలం? సైబర్ బుల్లీయింగ్ అనేది చాలా తీవ్రమైన నేరమని, ముఖ్యంగా మహిళలు, యువత, చిన్నారులు ఇలాంటి వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇలాంటి దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై ఉంది.
మీ మౌనం వెనుక ఉద్దేశం ఏమిటి?:
ఈ వ్యవహారంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయి, టీవీ ఛానళ్లలో చర్చలు కూడా జరిగాయి, అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సహా కూటమి నాయకులు ఇప్పటికైనా స్పందించాలి. మీ పార్టీకి చెందినవారే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే వారిని నియంత్రించి చర్యలు తీసుకోండి, లేదంటే ఈ వ్యాఖ్యలతో మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించండి. మీ పేర్లు చెప్పుకుంటూ ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే మీరు మౌనంగా ఉండటం చూస్తుంటే వారిని సమర్థిస్తున్నారా, ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి దూషణలకు భయపడరు, కానీ సమాజంలో మరెవరూ ఇటువంటి సైబర్ వేధింపులకు గురికాకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులను ఆశ్రయించాం. సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడానికి వేదికగా మార్చే వారిని ఉపేక్షించకూడదు. పోలీసులు ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి బాధ్యులందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సైబర్ బుల్లీయింగ్‌ను ఖండించాలని, కూటమి పెద్దలు తమ మౌనం వీడి ఈ ఘటనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కాకాణి పూజిత డిమాండ్ చేశారు.