నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్
-12వ వార్డు అభ్యర్థిగా నక్క గోవిందమ్మ నామినేషన్
నర్సీపట్నం అక్టోబర్ 18 మేజర్ న్యూస్:
నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున బొట్టా కృష్ణ రమాదేవి, 12వ వార్డు మెంబర్ అభ్యర్థిగా నక్క గోవిందమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బహుజన బొట్టా నాగరాజు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ రాజకీయాలు కొంతకాలంగా కుటుంబాల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. పట్టణంలోని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఈసారి మార్పు కోసం ఆలోచించాలని కోరారు. బీఎస్పీ అభ్యర్థి రమాదేవికి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రమాదేవి మాట్లాడుతూ మధ్యతరగతి యువతిగా ప్రజల ముందుకు వచ్చానని, పట్టణంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ కొల్లు గంగాధర్, యువజన విభాగం అధ్యక్షుడు కిల్లాడ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.