‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం
‘నమో సేవా గాథ’ ప్రత్యేక వాహనం ప్రారంభం
భీమవరం, మేజర్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ, సుపరిపాలన, దేశాభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశంతో రూపొందించిన ‘నమో సేవా గాథ’ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం భీమవరం బీజేపీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను తిలకించారు.ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కళారూపాల ద్వారా ప్రజలకు సులభంగా వివరించడమే ‘నమో సేవా గాథ’ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, జనధన్, ఉజ్వల, ముద్ర యోజన, బేటీ బచావో–బేటీ పఢావో తదితర పథకాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు.భీమవరం పట్టణంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేక వాహనం ద్వారా నాటక ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాయిత సురేంద్ర, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపర్ది, నాయకులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, పుల్లజీ, షేక్ మొహుద్దీన్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం