అనన్య నాగళ్ల 'ది బ్రేకింగ్ న్యూస్' ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్ 11న థియేటర్లలోకి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది బ్రేకింగ్ న్యూస్. సీనియర్ నటుడు మురళీ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి పవన్ కడియాల దర్శకత్వం వహించారు. ప్రేమ్ కృష్ణ, వాసుదేవ్, సోనియా నాయుడు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయడంతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. డిసెంబర్ 11న ది బ్రేకింగ్ న్యూస్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరిత మలుపులతో సాగుతూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో అనన్య నాగళ్ల అరుణ అనే పవర్‌ఫుల్, ఇంటెన్స్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్నారు. నిజాన్ని వెలికితీసే క్రమంలో ఒక జర్నలిస్ట్ ఎదుర్కొనే సవాళ్లు, మీడియా రంగం వెనుక దాగి ఉన్న రహస్యాలు, రాజకీయ మరియు సామాజిక ఒత్తిళ్ల నేపథ్యంలో కథనం ఆసక్తికరంగా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. సీనియర్ నటుడు మురళీ మోహన్ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని తెలుస్తోంది.
గతంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలపడంతో సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. అనన్య నాగళ్ల తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని సీరియస్ మరియు పవర్‌ఫుల్ జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నటించడం విశేషం. ఆకట్టుకునే నేపథ్య సంగీతం, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానున్న ది బ్రేకింగ్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.