నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు
శ్రీకాకుళం, సూర్య : ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా, నిత్యయవ్వనంగా ఉండాలంటే నడకను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. నడక శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, మెదడు చురుకుదనానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. నడవండి.. నడిపించండి.. నవశకానికి నాంది పలకండి’ అనే నినాదంతో 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనేక కార్యక్రమాల ద్వారా పురోగతి సాధించిందని, సామాజిక సేవలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించనున్న వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవ వేడుకలకు ఆత్మీయ అతిథిగా హాజరుకావాలని కోరుతూ గురువారం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ సూర శ్రీనివాసరావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై కార్యక్రమ వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ కొంత సమయం నడకకు కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. నడక వల్ల శరీరానికి చురుకుదనం లభించడంతో పాటు మెదడు పనితీరు మెరుగుపడేందుకు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నడకను అలవాటు చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులకు కూడా ఈ అలవాటును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో వాకర్స్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ సూర శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. నవంబర్ 1న జరగనున్న 40వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడ, గేదెల లక్ష్మి, పిజి గుప్తా, ఎస్ సంజీవరావు , జి జగ్గారావు,తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.