నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి/ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, సభల ఆహ్వాన పత్రికను అందజేశారు.
డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ మహాసభలు జరగనున్నాయని గజల్ శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 19న ఉదయం 10:30 గంటలకు జరిగే ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేయాలని కోరినట్లు చెప్పారు.
తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు బాలబాలికల కోసం, వారి చేతనే ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించామని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగు భాషలోని వివిధ సాహిత్య ప్రక్రియల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని తెలిపారు. శ్రీ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణం, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రధాన వేదికపై జరగనున్న ఈ వేడుకలకు 30 దేశాల నుండి బాల ప్రతినిధులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరుకానున్నట్లు వెల్లడించారు. తమ ఆహ్వానానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాసభల ముఖ్య సమన్వయకర్తలు డా. కె. మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.