మురసు తుపాను తీవ్రరూపం.. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం
విజయవాడ, మేజర్ న్యూస్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290, మచిలీపట్నానికి 320, కావలికి 310, ఒంగోలుకు 330, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.