సిక్కింలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పర్యటన
సూర్య జాతీయ డెస్క్: కేంద్ర పంచాయతీ రాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ సిక్కిం రాష్ట్రంలో అధికారికంగా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గ్యాంగ్‌టక్, మంగన్ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రూ. 3.75 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కొండ ప్రాంతమైన సిక్కింలో మత్స్య రంగాన్ని ప్రోత్సహించి రైతు జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
పర్యటనలో భాగంగా మంగన్ జిల్లాలోని మంగ్షిలా వద్ద ఉన్న లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్‌ను సందర్శించి ఫిష్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులతో కేంద్ర మంత్రి నేరుగా మాట్లాడనున్నారు. కొండ ప్రాంతాలలో చేపల పెంపకం, మార్కెటింగ్ సవాళ్లు మరియు క్షేత్రస్థాయి అవసరాలను ఆయన పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా ఆర్గానిక్ చేపల పెంపకానికి సంబంధించిన ప్రామాణిక నిబంధనల (SOP) పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు మత్స్య రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు (KCC), ముఖ్యమంత్రి మత్స్య ఉత్పాదన యోజన కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
ఈశాన్య ప్రాంతంలో ఉన్న విస్తారమైన జలవనరులు, జీవవైవిధ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ సుస్థిర మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పాడి పరిశ్రమ రంగాన్ని బలోపేతం చేసేందుకు గ్యాంగ్‌టక్‌లోని సిక్కిం సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ వద్ద పాడి సహకార కార్యక్రమాలను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.