మున్సీ పోల్స్ ప్రశాంతం సంపూర్ణం.
మున్సీ పోల్స్ ప్రశాంతం సంపూర్ణం.
పెడన: మేజర్ న్యూస్: రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన తుది గణాంకాల ప్రకారం మొత్తం 79.42 శాతం పోలింగ్ నమోదైంది అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు మున్సిపాలిటీలోని 28 వార్డుల పరిధిలో మొత్తం 25,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,212 మంది పురుషులు, 13,161 మంది మహిళలు ఉన్నారు. ఇతర ఓటర్లు లేరు. మొత్తం ఓటర్లలో 20,151 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ వివరాలు
- పురుషులు: 9,752 మంది
- మహిళలు: 10,399 మంది
- ఇతరులు: 0
- మొత్తం పోలైన ఓట్లు: 20,151 (79.42%)
పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఎక్కడా కూడా చెదురు మధురు సంఘటనలు తప్ప ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగుల కొరకు వీల్ చైర్ లో ఏర్పాటు చేసి సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువెళ్లారు. ఉదయం ఎనిమిది గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు అనగా మంగళవారం స్థానిక సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల నందు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.