ఏపీకి అండగా తమిళనాడు: చంద్రబాబు విజ్ఞప్తికి సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి విద్యుత్ సిబ్బంది
సూర్య న్యూస్ బ్యూరో, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తుఫాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా వేలాది సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగి విద్యుత్ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబు వివరించారు. విపత్తు సంభవించిన వెంటనే యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన సాంకేతిక సిబ్బందిని, క్రేన్లు, పోల్ ఎరెక్టర్లు తదితర యంత్ర పరికరాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని కోరారు.
చంద్రబాబు విజ్ఞప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అత్యంత సానుకూలంగా స్పందించారు. విపత్తు వేళ ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ బృందాలు, అత్యవసర సాంకేతిక సిబ్బందిని తక్షణమే ఏపీకి తరలించేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే గతంలో సంభవించిన అర్నాబ్ తుఫాను సహాయక చర్యల్లో తెలంగాణ విద్యుత్ సిబ్బంది ఏపీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తుండగా, తాజా ‘మురసు’ తీవ్రత దృష్ట్యా తమిళనాడుతో పాటు అవసరమైతే కర్ణాటక ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని ఏపీ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. తీరప్రాంత జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థలు స్తంభించిపోకుండా ముందస్తుగా 6,000 నుంచి 8,000 విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచామని, తుఫాను తీరం దాటిన 48 గంటల్లోపే పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.