మురసు తుపాను బీభత్సాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు, మేజర్‌న్యూస్:
మురసు తుపాను పర్చూరు నియోజకవర్గంలో సృష్టించిన బీభత్సం, భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన అపార నష్టాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల కారణంగా ఇప్పటికే మూడుసార్లు వరదలతో పర్చూరు ప్రాంతం అతలాకుతలమైందని, ప్రతిసారీ రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. వరద ముంపు సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, వరద కాలువలు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పునర్నిర్మించి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని కోరారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాలను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సభ్యులను కలిసి నియోజకవర్గంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగం, విద్యుత్తు వ్యవస్థ, తాగునీటి పథకాలు, రహదారుల పరిస్థితిని వివరించారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన పర్చూరు నియోజకవర్గాన్ని ఆదుకునేందుకు రూ.202.87 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన కేంద్ర బృందంలో చిత్తరంజన్ దాస్, సంయుక్త కార్యదర్శి; ప్రశాంత్ ఆర్మోరికర్, అదనపు అభివృద్ధి కమిషనర్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ; హిమాలయ గార్గ్, అసిస్టెంట్ డైరెక్టర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ శాఖ; ప్రణయ్ గార్గ్, డిప్యూటీ డైరెక్టర్, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ సభ్యులుగా ఉన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కూడా పాల్గొన్నారు.
రూ.202.87 కోట్లతో పునరుద్ధరణ ప్రతిపాదనలు
మురసు తుపాను కారణంగా పర్చూరు నియోజకవర్గంలో జరిగిన నష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు మొత్తం రూ.202.87 కోట్లతో పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. కొమ్మమూరు కాలువకు 55 చోట్ల గండ్లు పడటంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరిందని, కాలువకు పటిష్ఠమైన మరమ్మతులు చేపట్టేందుకు రూ.5 కోట్లు అవసరమని తెలిపారు. నియోజకవర్గంలో 5,962 ఇళ్లు దెబ్బతిన్నాయని, 574 గొర్రెలు, మేకలు, 52 గేదెలు మృత్యువాత పడ్డాయని పేర్కొంటూ బాధిత కుటుంబాలు, పశుపోషకులను ఆదుకోవాలని కోరారు.
రహదారుల పునరుద్ధరణకు రూ.64.13 కోట్లు
తుపాను ప్రభావంతో ఆరు మండలాల్లో రహదారులు, కల్వర్టులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆర్అండ్బీ పరిధిలో 24 పనులకు రూ.45.40 కోట్లు, పీఐయూ పరిధిలో 9 పనులకు రూ.12.56 కోట్లు, పంచాయతీరాజ్ పరిధిలో 6 పనులకు రూ.6.17 కోట్లతో మొత్తం రూ.64.13 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర బృందానికి వివరించారు.
వరద కాలువల ఆధునికీకరణకు రూ.95 కోట్లు
పర్చూరు ప్రాంతంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వరద నీరు గ్రామాలు, పంట పొలాలను ముంచెత్తుతోందని, ఇప్పటికే మూడుసార్లు వరదలతో ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. రొంపేరు పరివాహక ప్రాంతంలో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించి, కాలువల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రాంతంలోని 17 పెద్ద, 9 మధ్యస్థ, 43 చిన్న డ్రైన్లు పూడికతో నిండిపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లడం లేదని తెలిపారు. వరద కాలువలు, డ్రైన్లను ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేయడంతో పాటు పూడిక తొలగింపు, ప్రవాహ మార్గాల విస్తరణ, అవసరమైన నిర్మాణాలతో శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఇందుకోసం రూ.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ పనులకు సాంకేతిక అనుమతులు లభించాయని, ఆర్థిక ఆమోదం మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటూ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాగునీటి పథకాలకు రూ.38.74 కోట్లు
నియోజకవర్గంలోని 12 రక్షిత మంచినీటి పథకాల అభివృద్ధికి గతంలో మంజూరైన రూ.38.74 కోట్ల నిధులు రద్దు కావడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఏలూరి వివరించారు. పర్చూరు పథకానికి రూ.10.41 కోట్లు, ఇంకొల్లు పథకానికి రూ.9.94 కోట్లు, రాజుబంగారుపాలెం పథకానికి రూ.4.77 కోట్లు సహా పెండింగ్‌లో ఉన్న నిధులను తిరిగి మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్తు, వ్యవసాయ రంగాలకు అపార నష్టం
మురసు తుపాను ధాటికి నియోజకవర్గంలో సుమారు 4,500 వరకు విద్యుత్తు స్తంభాలు నేలకూలాయని, విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఏలూరి తెలిపారు. ఏటా తుపాన్ల సమయంలో ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా విద్యుత్తు వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు.
జనుము, మొక్కజొన్న, మిర్చి, పొద్దుతిరుగుడు, మినుము, శనగ తదితర పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేసి అర్హులైన రైతులకు తగిన పరిహారం అందించాలని కేంద్ర బృందాన్ని విజ్ఞప్తి చేశారు.