మున్సిపల్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత
డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి
ప్రతి కౌంటర్ వద్ద పౌరులకు సహాయం అందించేలా సిబ్బంది నియామకం
ప్రొద్దుటూరు, నవంబర్ 11 మేజర్ న్యూస్ :ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని మున్సిపల్ కార్యాలయ కౌంటర్ల వద్ద జరిగే అన్ని రకాల చెల్లింపులను డిజిటల్ విధానంలో నిర్వహించే దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. మున్సిపల్ కౌంటర్లలో ఇప్పటికీ గణనీయ సంఖ్యలో లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఆన్‌లైన్ విధానంలో పన్నులు, ఇతర మున్సిపల్ రుసుములు చెల్లించేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. UPI, QR కోడ్ తదితర డిజిటల్ చెల్లింపు సదుపాయాల వినియోగంపై పౌరులకు అవగాహన కల్పించడంతో పాటు, చెల్లింపులు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రతి కౌంటర్ వద్ద ప్రత్యేకంగా ఒక సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ సేవలను మరింత పారదర్శకంగా, ప్రజలకు సౌకర్యవంతంగా అందించడమే లక్ష్యమని, నగదు రహిత లావాదేవీల విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇకపై మున్సిపల్ కౌంటర్ల వద్ద నగదు లావాదేవీలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అన్ని కౌంటర్లలో డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ప్రజలు కూడా మున్సిపల్ సేవలను వినియోగించుకునే సమయంలో డిజిటల్ చెల్లింపు విధానాలకు ప్రాధాన్యత ఇచ్చి నగదు రహిత ప్రొద్దుటూరు నిర్మాణానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
– షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా