ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మరియు స్పెషల్ నోడల్ ఆఫీసర్ వెంకటపతి సూచనల మేరకు ఎన్నికల అధికారులు నిబంధనలకు అనుగుణంగా పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 52 కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి 219 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారి మరియు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తూ, నిబంధనల అమలు మరియు భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. పరిశీలన అనంతరం నామినేషన్ పత్రాలను ప్రత్యేక భద్రతా గదిలో భద్రపరిచారు. పత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆ గదిని సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నామినేషన్స్ పరిశీలన అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడంతో నామినేషన్స్ పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ, సంబంధిత అధికారుల సమన్వయంతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ, నిబంధనల అమలు, నామినేషన్ పత్రాల భద్రతే లక్ష్యంగా ప్రొద్దుటూరు ఎన్నికల యంత్రాంగం పనిచేస్తోందని కమీషనర్ అన్నారు. ఈకార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి వెంకటపతి, అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ మంజునాధ్ గౌడ్, నోడల్ అధికారి ఎన్నికల ప్రవర్తన నియామవాళి కృష్ణ సింగ్, ఇతర నోడల్ అధికారులు యశోద, సురేంద్ర, రాజేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా