మూలా నక్షత్రం వేళ పటిష్ట పోలీసు బందోబస్తు.. అర్ధరాత్రి నుంచే సీపీ, కలెక్టర్ పర్యవేక్షణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అర్ధరాత్రి నుంచే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మూలా నక్షత్రం సందర్భంగా అదనంగా 1,200 మంది పోలీసు సిబ్బందిని, 54 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, మూడు హోల్డింగ్ ఏరియాల్లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో మిగిలిన భక్తులకు అసౌకర్యం కలగకుండా కార్పస్ బ్రిడ్జి నుంచి గద్దె బొమ్మ సెంటర్ వరకు రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్, కలెక్టర్ హోల్డింగ్ ఏరియాలు, క్యూలైన్లు, కార్పస్ బ్రిడ్జి, గద్దె బొమ్మ సెంటర్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులతో సంయమనంతో వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. భక్తులు ఏవైనా అసౌకర్యాలు ఎదుర్కొంటే సమీపంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అమ్మవారి ఆలయం వరకు ఉన్న క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి రద్దీ నియంత్రణ, భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.