మొగళ్లూరులో తోడికోడళ్ల ఎన్నికల పోరు! కుటుంబ బంధాలు ఒకవైపు.. రాజకీయ పోటీ మరోవైపు...
పొదలకూరు, మేజర్ న్యూస్ : మండలంలోని మొగళ్లూరు ఎంపీటీసీ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు వేర్వేరు పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలవడంతో ఈ స్థానం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన ఈ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ల శంకరమ్మ నామినేషన్ దాఖలు చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె తోడికోడలు కూకట్ల ఉష పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో మొగళ్లూరు ఎంపీటీసీ ఎన్నికపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. శంకరమ్మ భర్త నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా, ఉష భర్త శ్రీనివాసులు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరు రాజకీయ పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలవడం ఈ పోటీకి ప్రత్యేకతను తీసుకొచ్చింది. కుటుంబ బంధాలు ఒకవైపు.. రాజకీయ పోటీ మరోవైపు అన్నట్లుగా మారిన మొగళ్లూరు ఎంపీటీసీ ఎన్నికలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.